జోహ్నెస్‌బర్గ్: మొదటి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి ధోనీ సేన కసి తీర్చుకుంది. సఫారీ జట్టుపై 1 పరుగు తేడాతో గెలిచి చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో కేవలం 1 పరుగు తేడాతో స్మిత్ సేనపై విజయం సాధించింది. యువరాజ్ 53(68), ధోనీ 38(61) సమయోచిత
బ్యాటింగ్‌తో పాటు మునాఫ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే దిశలో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ స్మిత్ 77(98) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ రాణించలేదు. స్మిత్ సేన వెన్ను విరచడంలో భారత్ బౌలర్లు సఫలమయ్యారు. ముఖ్యంగా మునాఫ్‌పటేల్ నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు. జహీర్‌ఖాన్ రెండు వికెట్లు తీయగా, నెహ్రా, హర్భజన్‌సింగ్, రోహితశర్మలకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 190 పరుగులకు ఆలౌటైంది. తొత్సబే నాలుగు వికెట్లు తీసి భారత్ అధిక స్కోరు చేయకుండా నిలువరించాడు. మిగిలిన బౌలర్లలలో స్టెయిన్, మోర్కెల్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, బొతాకు ఒక వికెట్ దక్కింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మునాఫ్‌పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈనెల 18న కేప్‌టౌన్‌లో మూడో వన్డే జరగనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి