Loading...

ఆధ్యాత్మిక వారధి



దీపాలతో మహా లక్ష్మీ ప్రసన్నమవుతుందట

ఆధ్యాత్మిక వారధి: ఆశ్వీజ మాస బహుళ చతుర్ధశిని "నరక చతుర్ధశి" అని, ఆ మరుసటి రోజును "దీపావళి" అమావాస్య అని అంటారు. ఇది పిల్లలకు ,పెద్దలకు సరదా పండుగ. తెల్లవారుజామునే తలస్నానం చేసి , కొత్త దుస్తువులు ధరించి ,వ్రతం చేసుకుని , పిండి వంటలతో భోజనం చేసి , సాయంత్రం కాగానే దీపాల్ని వెలిగించి , అనంతరం టపాసులు కాల్చడం ఈ పండుగకు అనవాయితి. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. శ్రీ కృష్ణుడు సత్యభామ సామేతుడై లోకకంటకుడైన నరకాసూరుని వధంచి నందుకు సంబరంగా జరుపుకునే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాల సముద్రాన్నిమదించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా , మరియు శ్రీ రామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోద్యకుచేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్బంగా చెప్పుకుంటారు. దీపావళికి దీపాలను వెలిగించి , బాణాసంచా కాలుస్తూ , అందరూ వారి వారి ఆనందాన్ని వ్యక్త పరుస్తుంటారు. ఏ ఇంటి ముందు దీపాలు సమృద్దిగా వెలుగుతాయో , ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీప్రవేశిస్తుందని మనకు ఋగ్యేదం చెప్తోంది.ఆ రోజు సాయంసంద్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసి కోట ముందు తొలత దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీఅష్టొత్తర శతనామాలతో పూజించి , నివేదన చేసి పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుట వల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లు మని అన్నట్లు ఆ మహా లక్ష్మీ ప్రసన్న మవుతుందట. 

తులసీ పూజతో సంతానం, సౌభాగ్యం

ఆధ్యాత్మిక వారధి: తులసీపూజతో మంచి సంతానం పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. తులసిని ఆరాధించడం వల్ల సౌభాగ్యం, మంచి సంతానం, ఆయుర్ వృద్ధి, ధనం, ఆరోగ్యం. ధాన్యం, ఫలసిద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి. అందుచేత శుక్ర, శనివారాల్లో మహిళలు సూర్యోదయానికి ముందేలేచి శుచిగా తలస్నానమాచరించి, తులసి కోట ముందు దీపమెలిగించి, మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆరోగ్ర ప్రదాయిని అని అందరికీ తెలుసు. కాబట్టి తులసీ మాలతో జపం పుణ్యప్రదమని, అందుచేత తులసి వృక్షానికి నీరు పోసి, ప్రదక్షిణం చేసి, నమస్కరిస్తే ఏడు ద్వీపాలతో కూడిన సాగరాన్ని ప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుంది. ఇంకా తులసీ దళాలతో పూజ చేసే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. సర్వదా విష్ణువుకు ప్రీతికరమైనదిగా, సకల దేవతల చేత నమస్కరించబడేది తులసీ కావడంతో 'తులసీ పూజ' శ్రేష్టమైందని పురోహితులు సూచిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రత పూజా సామాగ్రి
 అధ్యాత్మికవారధి: శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః 1. పసుపు 2. కుంకుమ 3. పండ్లు 4. పూలు 5. తమలపాకులు 6. అగరవత్తులు 7. వక్కలు 8. కర్పూరం 9. గంధం 10. అక్షింతలు 11. కొబ్బరి కాయలు 12. కలశము 13. కలశ వస్త్రము
1. అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము
2. పంచామ్రుతము అనగా : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదర, అన్నీ కలిపినది.
3. దీపములు , తైలం, నెయ్యి.
4. వస్త్రములు: పత్తితో చేయవచ్చు. లేదా కొత్తచీర, రవిక ( జాకెట్టు గుడ్డ ) ఉన్నచో అమ్మవారికి పూజా సమయంలో సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు.
5. ఆభరణములు : కొత్తవి చేయిస్తే అవి అమ్మవారికి పెట్టిన తరువాత వేసుకోవచ్చు.
6. మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకముల పిండివంటలు. వీలు కాకపోతే వారి వారి శక్తి కొలదీ రకరకాల పిండివంటలు చేయవచ్చు.
7. తోరము : తొమ్మిది ముడులు వేసిన తోరము. పసుపు దారములో ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. (మూడు తోరాలు కావాలి. ఒకటి అమ్మవారికి, మరొకటి మీకు, ఇంకొకటి ముత్తయిదువుకు)
8. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో ( వెండి చెంబులో ) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకక పోతే తమల పాకులు గాని వేసి, ఆ కుంభం మీద కొత్త రవికెల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
9. మంచి నీటితో గ్లాసు, ఉద్దరిణా (చెంచా) ఉంచుకోవాలి.


శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ
అధ్యాత్మికవారధి: అక్షింతలు చేతిలో వేసుకుని, కథ భక్తి,శ్రద్దలతో చదవండి /వినండి.
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'. ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.
పార్వతీదేవి ' నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే
అని అనేక విధములు స్తోత్రం చేసింది.
'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.
ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.
చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.
దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.
చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.
వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.
అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.
సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.
వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.
కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకుని, మిగతా వారి మీద వెయండి.

వరలక్ష్మీ వ్రతంతో అష్టైశ్వర్యాలు
అధ్యాత్మికవారధి: మహిళలకు అత్యంత ముఖ్యమైన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. వీలుకాని వారు, శ్రావణ మాసంలోని ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు. వరలక్ష్మీ పూజా విధానంలో ముఖ్యంగా... పూజామందిరంలో గానీ, ఇంట్లో పూజచేయ దలచిన చోటగానీ మండపాన్ని ఏర్పాటు చేసుకుని కలశాన్ని ప్రతిష్టించి, వరలక్ష్మీ దేవినీ అందులోనికి ఆవాహనం చేసుకుని, గణపతి పూజ, వరలక్ష్మీ పూజలను చేసి తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసుకుని... "బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభ ప్రదం" "పుత్రపౌత్రాభివృద్ధంచ సౌభాగ్యం దేహి మే రమే" - అనే శ్లోకాన్ని పఠిస్తూ చేతికి తోరమును కట్టుకోవాలి. ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను పఠించి

ఓం శ్రీ విఘ్నేశరాయ నమః
వినాయక చవితి - కథ

ఆధ్యాత్మికవారధి: చేతిలో అక్షతలు పట్టుకుని భక్తి శ్రద్ధ లతో విఘ్నేశ్వరుని కథ వినండి లేదా చదవండి. సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహాశివుని వాహన మైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లు గా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని' వేడు కొన్నాడు.

అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థాన మయ్యాడు.
వినాయక జననము
కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు అతని తల నరికి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు.అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.
కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.
విఘ్నేశాధి పత్యము
ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు.
ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
'సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'
కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవ గలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'
ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.
పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'
ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట
ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే!
దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.
శమంతకోపాఖ్యానము
ద్వాపర యుగములో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.
కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉన్నది. అది సూర్యవరము వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారము నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.
ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.
అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష!నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.
ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది.
దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు అ మణినిస్తే నేనువెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.
తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరిం చి, మణిని మృదువుగా తిరస్కరించాడు.
ఒక శుభముహుర్తమున శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి? అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశమున చంద్ర దర్శనము అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక 'అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.
'కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చరుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు.
చేతిలోని అక్షింతలు కొన్ని వరసిద్ధి వినాయకునిమీద, మీమీద మీ కుటుంబ సబ్యులమీద వేయండి.
సర్వేజనాః సుఖినో భవంతు.


మహాగణపతి పూజకు 21 పత్రాలు...
ఆధ్యాత్మికవారధి: మహాగణపతి, హరిద్రాగణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీతగణపతి అనే ఆరు రూపాలుగా పూజ లందుకుంటున్న విఘ్నేశ్వరునికి అన్ని పూజల్లోకెల్లా 21 పత్రాలతో చేసే పూజ అంటే మహా ప్రీతట. పత్రాలతో గణపయ్యను ఎలా ప్రార్థించాలంటే..
1. ఓం సుముఖాయ నమః మూచీపత్రం సమర్పయామి
మాచీపత్రి (చేమంతి జాతికి చెందినది. దీని ఆకులు సువాసనభరితంగా ఉంటాయి. చూసేందుకు చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి) కళ్లకు చలువ చేస్తుంది. తొలనొప్పిని పోగొడుతుంది. మనస్సుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
2. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి
బృహతీపత్రం అంటే... వంగ ఆకుల మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు శ్వాసకోస వ్యాధుల్ని నివారిస్తాయని పండితులు అంటున్నారు.
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి
బిల్వపత్రమంటే.. మారేడు ఆకు. శివుడికి మహా ఇష్టమైన పత్రంతో గణపతిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ ఆకు నీళ్లలోని మలినాలను తొలగిస్తుంది.
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
పచ్చిక బయళ్ళలో లభించే గరిక చర్మవ్యాధుల్ని పోగుడుతుంది. తెల్లగరిక, నల్లగరిక అనే రెండు రకాలు కలవు. ఇందులో గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
5. ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం పూజయామి
దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త ఆకులు ఎటువంటి విషాన్నైనా తొలిగిస్తాయి.
6. ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం పూజయామి
బదరీ పత్రం అంటే.. రేగు ఆకు. ఈ రేగు ఆకుల్ని ఆవులు నమిలితే బాగా పాలిస్తాయి. మనం నమిలితే గొంతులోని బాధలన్నీ తొలగిపోతాయి. రక్తదోషాలు ఉండవు.
7. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
అపామార్గ పత్రం అంటే.. ఉత్తరేణి ఆకు. ఈ ఉత్తరేణి ఆకులు పంటికి మంచివి.
8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి
తులసి ఆకులు నీటిని, గాలిని శుద్ధి చేస్తుంది.
9. ఓం ఏకదంతాయనమః చూతపత్రం పూజయామి
చూతపత్రం అంటే మామిడి ఆకులు. ఇవి గొంతుబాధల్ని పోగొడతాయి.
10. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
శంఖు పత్రాలనబడే విష్ణుక్రాంత పత్రాలు జ్ఞాపకశక్తి, మేధోశక్తిని పెంచుతుంది.
11. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
దాడిమీ పత్రాలంటే.. దానిమ్మ ఆకులు. ఇవి అతిసారాన్ని అరికడుతాయి.
12. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి
దేవదారు పత్రం అంటే.. దేవతలకు ఎంతో ఇష్టమైన ఆకు. ఇది క్రిమికీటకాలను దగ్గరకు రానీయదు
13. ఓం ఫాలచంద్రాయనమః మరువక పత్రం పూజయామి
మరువం గుండెజబ్బులకు మంచి మందుగా పనిచేస్తాయి. ఈ పత్రాన్ని వాడుక భాషలో ధవనం, మరవం అంటారు. ఆకు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
14. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
వావిలాకు పత్రాలనబడే సింధువార ఆకుల్ని విషానికి విరుగుడుగా వాడుతారు. ఈ ఆకు వాసనకు జ్వరాలు తగ్గుతాయి.
15. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి
అజీర్తిని హరించే పత్రం జాజిపత్రం
16. ఓం సురగ్రజాయ నమః గణ్డనేపత్రం పూజయామి
చర్మవ్యాధులకు ఈ మొక్కకు పూసే తెల్లని పువ్వులు పనిచేస్తాయి. వీటిని ఏనుగు చెవి ఆకులు అంటారు.
17. ఓం ఇభవక్ర్తాయ నమః శమీపత్రం పూజయామి
జమ్మి ఆకులనబడే శమీపత్రం అవాంఛీత రోమాల్ని తొలగించే ఔషదంగా ఉపయోగపడుతుంది
18. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
రావి ఆకులు, బెరడులో ఎన్నో ఔషధగుణాలున్నాయి.
19. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి
మద్ది ఆకులనబడే అర్జున పత్రాలను గాయాలు సెప్టిక్ కాకుండా ఉంచుతాయి. పుండ్లు తగ్గిపోతాయి.
20. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి
జిల్లేడు ఆకులైన అర్కపత్రాలవు విషాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
21. ఓం గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాణి పూజయామి... అంటూ విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థి నాడు పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆ సంవత్సరమంతా విజయాలు వరిస్తాయని విశ్వాసం.


వినాయకడిని ఇలా పూజించండి....
 ఆధ్యాత్మికవారధి: దేవతలకు అధిపతి అయిన గణనాథునికి ఏ పూజ నిర్వహించినా తొలిపూజ అందిస్తాం. అదే వినాయక చవితినాడు ప్రత్యేక పూజలన్నీ ఆయన ఒక్కడికే. వినాయకుడు జన్మదినమైన గణేశ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు లేవాలి.
శుచిగా తలస్నానమాచరించి ఆకుపచ్చరంగు పట్టువస్త్రాలను ధరించాలి. పూజామందిరము, గృహమును శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి.
ఇంతలో పూజకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. వినాయకుడి ఫోటో. లేదా శ్వేతార్క గణపతి ప్రతిమకు పసుపు, కుంకుమ పెట్టాలి. పసుపురంగు అక్షింతలు, అలంకరణకు కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలను తయారు చేసుకోవాలి.
నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయలను సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు రెంచు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి.
విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో... మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి. తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం.
కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి.తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇకపోతే.. ఇంట్లో పూజకోసం ఉంచిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేవరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి, హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షతలు జల్లి, విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి.
వినాయక చతుర్థి నాడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని, అయినవల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం. అలా కుదరని పక్షంలో సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.
అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికెతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికెతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

గంగాస్నానంతో మధుమేహం మాయం
వారధి: ప్రాచీన సంప్రదాయమైన గంగాస్నానం చక్కెర వ్యాధి పీడితులకు ఉపయోగకరం కాగలదని ఇటీవల నిర్వహించిన ఒక శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. గంగా నదీజలాలలో సూక్ష్మక్రిములను సంహరించే గుణాలు ఉన్నాయని అంతకు ముందు అధ్యయనాలలోనే తేలినప్పటికీ ప్రస్తుత అధ్యయనంలో సాంప్రదాయిక యాంటిబయాటిక్స్‌కు లొంగని వ్యాధులను ఈ జలాలు నిర్మూలిస్తాయని వెల్లడైంది. గంగా జలాలలో బాక్టీరియాను నిర్మూలించే మరో బాక్టీరియా వ్యతిరేక పదార్ధాలున్నాయి. అవి బాక్టీరియాను చంపగలిగేంతటి శక్తిమంతమైనవి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థకు చెందిన రాజు అనే స్నాతకోత్తర పరిశోధకుడు ఈ అంశంపై పరిశోధన చేశారు. సాంప్రదాయిక యాంటిబయాటిక్‌ చికిత్సకన్నా గంగా నదీ స్నాన చికిత్స మరింత సమర్ధవంతంగా డయాబిటిస్‌లో పనిచేస్తుందని ఆయన రుజువులు కనుగొన్నారు. ' స్టాఫలోకోకస్‌ ఆరియస్‌' బాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధులను గంగాజలాలలోని బాక్టీరియా వ్యతిరేకపదార్ధాలు నిర్మూలిస్తాయని ఎలుకలపై చేసిన పరిశోధనలలో తేలింది. ఈ ఫలితాలను 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ రీసెర్చ్‌ ఇన్‌ మైక్రోబయాలజీ' కూడా ఆమోదించింది. గుల్బర్గా యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగంలో ఈ పరిశోధనలు జరిగాయి. డాక్టర్‌ చంద్రకాంత్‌ కేల్‌మాని ఇందుకు గైడ్‌గా వ్యవహరించారు. ఇతర బాక్టీరియాపై కూడా పరిశోధనలు నిర్వహించేందుకు తమ విభాగం సిద్ధమవుతోందని రాజు చెప్పారు.