Loading...

14, డిసెంబర్ 2010, మంగళవారం

చీమలలో అద్భుతమైన తెలివి...

వాషింగ్టన్‌: చీమలు తెలివైన ప్రాణులన్నది తెలిసిన విషయమే. కానీ, వాటి తెలివి సాధారణస్థాయిలో లేదని, సంక్లిష్టమైన గణిత సమస్యలను కూడా పరిష్కరించవచ్చని కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎదురయ్యే సమస్యను బట్టి తగిన పరిష్కారాన్ని ఎంచుకోవటం (ఆప్టిమల్‌ సొల్యూషన్‌) అన్నది ప్రస్తుతం కొన్ని ప్రత్యేక కంప్యూటర్లకు మాత్రమే సాధ్యమవుతున్న పరిస్థితుల్లో.. చీమలు ఆ పనిని చాలా సులువుగా చేయటం
పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్‌రీడ్‌ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చీమలపై కొన్ని ప్రయోగాలు జరిపింది. ఒక వైపు చీమలు తినే పదార్థాలను ఉంచారు. వాటిని చేరుకోవటానికి 32,768 దారులను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు దారులు మాత్రమే అత్యంత దగ్గరివి. చీమలను అక్కడ వదిలినప్పుడు.. దాదాపు గంట సమయంలోనే దగ్గరి దారిని కనుక్కున్నాయి. అనంతరం శాస్త్రవేత్తలు దగ్గరి దారులు రెండింటినీ మూసివేశారు. అప్పుడు చీమలు దీర్ఘమైన, సంక్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించి ఆహారాన్ని చేరుకున్నాయి. ఆ తర్వాత మరో గంటకు సుదీర్ఘ మార్గాలను వదిలిపెట్టి ఉన్నవాటిల్లో అత్యంత దగ్గరగా ఉన్న దారిని గుర్తించి దాంట్లో ప్రయాణించాయి. దీనిపై రీడ్‌ మాట్లాడుతూ.. 'సాధారణమైన చీమల్లో కూడా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తెలివితేటలున్నాయి. మారే పరిస్థితులకు అనుగుణంగా కొత్త పరిష్కారాలను గుర్తించే సామర్థ్యమున్న చీమలపై పరిశోధనలు జరపటం ద్వారా ఆప్టిమైజేషన్‌ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయవచ్చు. ఈ అల్గారిథమ్స్‌ పునాదిగా మెరుగైన నూతన సాఫ్ట్‌వేర్లను రూపొందించటం సాధ్యమవుతుంది' అని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి