Loading...

14, డిసెంబర్ 2010, మంగళవారం

రైతులకు అతిపెద్ద విపత్తు వచ్చింది: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎప్పుడూ లేని అతిపెద్ద విపత్తు రైతులకు వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శాసనసభలో రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వరుసగా వచ్చిన తుపాన్లతో రైతులు, కౌలుదార్లు నష్టపోయారని అన్నారు. పంటలు నష్టపోయినవారిలో ఎక్కువమంది కౌలురైతులేనని వెల్లడించారు. రాష్ట్రంతోపాటు...
కేంద్రం కూడా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 10.75 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని తెలిపారు. పంటలకు కొత్త తెగుళ్లు వచ్చాయని... వాటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు రూ.2 వేల కోట్ల పంటనష్టం జరిగిందన్నారు. కృష్ణా, ఉభయగోదావరి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతులను ఇప్పటికైనా పట్టించుకోకపోతే వ్యవస్థపై వారికి నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే మానవత్వం ఉన్న మనిషెవరైనా చలిస్తారని అన్నారు. అప్పులవారి బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి