Loading...
19, నవంబర్ 2010, శుక్రవారం
అయ్యప్ప భక్తులకు మరిన్ని సౌకర్యాలు
తిరువనంతపురం: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఈ సీజన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. అదనపు రైళ్లు, శబరిమల వరకు బస్సు సౌకర్యం, రద్దీ నివారణ చర్యలు, ప్రాంతీయ భాషల్లో సమాచార కేంద్రాలు, వైద్య సదుపాయాల వంటివి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో రైల్వే వివిధ ప్రాంతాలనుంచి శబరిమలకు 674 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటిలో దక్షిణ రైల్వే 448, దక్షిణ మధ్య రైల్వే 140, సౌత్ వెస్ట్రన్ రైల్వే 56, సెంట్రల్ రైల్వే 28 రైళ్లను నడపనున్నాయి. మొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాలనుంచి నార్త్ ఈస్ట్రన్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటితోపాటు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు 660 స్లీపర్ కోచ్‌లను, 30 ఏసీ కోచ్‌లను అదనంగా కలిపినట్లు రైల్వే డివిజన్ మేనేజర్ రాజీవ్దత్ శర్మ తెలిపారు. పంబ కొండ మీద కంప్యూటర్ రిజర్వేషన్ కేంద్రాన్ని నెలకొల్పినట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న సహాయ కేంద్రాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సమాచారాన్ని తెలియజేసే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చెంగన్నూరు, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్ల నుంచి శబరిమలకు బస్సు సర్వీసులు నడపడానికి కేరళ ఆర్టీసీ అంగీకరించిందని రాజీవ్ దత్ శర్మ తెలిపారు. కొట్టాయం వెళ్లే దారిలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశామన్నారు. అత్యంత రద్దీగా ఉండే మకర దర్శనం సందర్భంగా జనవరి 14న ఏవైనా అవాంఛనీయ పరిణామాలు తలెత్తితే ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నెలకొల్పినట్లు వివరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి