Loading...

14, డిసెంబర్ 2010, మంగళవారం

వైద్యవిద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష..

న్యూఢిల్లీ: అండర్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యవిద్య కోర్సులకు అఖిల భారత స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు భారత వైద్య మండలి (ఎంసీఐ)కి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహణకు సంబంధించి నియమనిబంధనలు రూపొందించేందుకు ఎంసీఐకి న్యాయస్థానం అనుమతి అవసరంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎంసీఐ చట్టబద్ధ సంస్థ అయినందున, అది నిబంధనలు రూపొందించి, నోటిఫై చేయొచ్చని తెలిపింది. ''నిబంధనలు రూపొందించండి. వాటిని నోటిఫై చేసి, అమలు పరచండి. వాటిని ఎవరైనా సవాలు చేస్తే అప్పుడు విషయం కోర్టు ముందుకు వస్తుంది'' అని ఎంసీఐని ఉద్దేశించి ద్విసభ్య ధర్మాసనం సోమవారం పేర్కొంది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష పెట్టేందుకు అనుమతించాలని కోర్టును ఎంసీఐ కోరిన నేపథ్యంలో, ధర్మాసనం ఈవ్యాఖ్యలు చేసింది. కొత్త నిబంధనలకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపిందని ఎంసీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. నిబంధనలు రూపొందించి, వాటికి అనుమతి కావాలంటూ తమ వద్దకు ఎవరూ రాలేరని కోర్టు ఎంసీఐకి తెలిపింది. 2011 నుంచి ఈ పరీక్షను నిర్వహించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఎంసీఐ ఇప్పటికే సీబీఎస్‌ఈని కోరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి