Loading...

15, డిసెంబర్ 2010, బుధవారం

జగన్ కు బిజెపి అండదండలు...?

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ స్థాపించడానికి సిద్ధపడిన వైయస్ జగన్ తో దోస్తీకి భారతీయ జనతా పార్టీ (బిజెపి) తహతహలాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను టార్గెట్ చేసుకుని ముందుకు దూసుకుపోతున్న వైయస్ జగన్ ద్వారా కేంద్రంలో పాగా వేయాలనేది బిజెపి ఎత్తుగడగా కనిపిస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిన ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిన బిజెపి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెసును దెబ్బ తీయగలితే కేంద్రంలో తనకు అధికారం సుగమం ...
అవుతుందనేది బిజెపి ఎత్తుగడగా కనిపిస్తోంది. వైయస్ జగన్ కోరితే ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో తలపెట్టిన 48 నిరాహార దీక్షలో పాల్గొంటామని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దీన్ని బట్టి వైయస్ జగన్ తో దోస్తీకి బిజెపి ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిపోతోంది. బిజెపి ఎత్తుగడలో భాగంగానే వైయస్ జగన్ పులివెందుల నుంచి శాసనసభకు కాకుండా కడప నుంచి లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి మద్దతు పలుకుతున్నారు. వీలైతే, రాయపాటి సాంబశివ రావును కూడా లాగవచ్చుననే ఉద్దేశంతో జగన్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్టానికి చెందిన కొద్ది పార్లమెంటు సభ్యులను లాగితే మిగతా కథ బిజెపి నడిపిస్తుందని అనుకుంటున్నారు. అది అంత సులభం కాకపోయినా ఆ మేరకు ప్రయత్నాలు చేయడంలో తప్పేమీ లేదని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వైయస్ జగన్ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎలో ఉన్న ఎన్సీపి నేత శరద్ పవార్ తో జగన్ చర్చలు జరిపిట్లు తెలుస్తోంది. పైగా, వైయస్ జగన్ జెడి (యు) నేతలు శరద్ యాదవ్, నితీష్ కుమార్, అన్నాడియంకె చీఫ్ జయలలితలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ను బిజెపికి దగ్గర చేసేందుకు కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగారు. ఓబుళాపురం మైన్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు ఆయన దెబ్బ తిన్న పులిలా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసును, తెలుగుదేశం పార్టీలను దెబ్బ తీసే ఉద్దేశంతో గాలి జనార్దన్ రెడ్డి ముందుకు కదులుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ను బిజెపికి దగ్గర చేయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి