కర్నాటకలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు

బెంగుళూరు, అక్టోబర్ 11 : కర్నాటక అసెంబ్లీలో సోమవారం ఉదయం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప మూజువాణి ఓటుతో నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించగా, స్వయంగా స్పీకరే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారంటూ గవర్నర్ భరద్వాజ కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. గవర్నర్ మాట ప్రకారం కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించాలా, లేదా అన్నది కేంద్రం ఇంకా నిర్ణయించుకోలేదు. గవర్నర్‌ను వెంటనే వెనుకకు పిలిపించాలని (రీ కాల్ చేయాలని) భారతీయ జనతా పార్టీ డిమాండు చేసింది. అయితే గవర్నరే రాజ్యాంగానికి తూట్లు పొడిచారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా గవర్నర్ ద్వారా తన స్వార్థ రాజకీయాలను నడిపిస్తున్నదని కూడా ఆ పార్టీ ఆరోపించింది. గవర్నర్ రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా కాంగ్రెస్ ప్రయోజనాలు పరిరక్షిస్తున్నారని కూడా బి.జె.పి. ఆరోపించింది. కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికే గవర్నర్ యత్నిస్తున్నారని, కర్నాటకలో బి.జె.పి. అధికారంలో ఉండడం గవర్నర్‌కు ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం 16 మంది ఎం.ఎల్.ఎ.లు ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నిస్తుంటే అందుకు గవర్నర్ వత్తాసు పలుకుతున్నారని బి.జె.పి. నాయకులు వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ మాత్రం ఈ ఆరోపణలను త్రోసిపుచ్చుతున్నారు. కర్నాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాజ్యాంగబద్ధమైనవి కావని ఆయన అంటున్నారు. కొంతమంది ఎం.ఎల్.ఎ.లు అసలు అసెంబ్లీలోకే వెళ్లలేదని, కాగా, ఎం.ఎల్.ఎ.లు కానివారు శాసనసభలోకి చొచ్చుకుపోయారని, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షలో మూజువాణి ఓటుతో నెగ్గినట్టు ప్రకటించడం కూడా రాజ్యాంగవిరుద్ధమేనని అంటున్నారు. ఈ మాటే ఆయన కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. అయితే స్పీకర్ ఒకసారి తీర్పు ప్రకటించాక, ఇక ఆ తీర్పును ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదని బి.జె.పి. నాయకులు వాదిస్తున్నారు. అంతకుముందు జరిగిన నాటకీయ పరిణామాలలో మొత్తం 16 మంది శాసనసభ్యులను సభనుంచి స్పీకర్ బహిష్కరించారు. అయితే వారు తమను అన్యాయంగా బయటకు పంపించారని కోర్టుకు వెళ్లారు. ఈ పరిణామాలమధ్య కర్నాటక వ్యవహారాలు రసకందాయంలో పడ్డాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి